తెలుగు సినిమాకి వజ్రోత్సవాలు అంటూ మనవాళ్లు ఏదో హడావిడి చేస్తున్నారుగానీ నిజానికి వీళ్లలో ఎంతమందికి ఈ ఉత్సవాన్ని నిర్వహించే అర్హత ఉంది అని ఆలోచిస్తే వేళ్లమీదే లెక్కకు వస్తారు. ఓ అక్కినేని, ఓ గుమ్మడి, ఓ అంజలీదేవి, ఓ నిర్మల... ఇలా చాలా తక్కువమంది మాత్రమే ఈ శుభసందర్భంలో గౌరవం పొందదగినవాళ్లు, తెలుగు సినిమా గురించి మాట్లాడదగిన వాళ్ళు.
అందరికీ చెందిన ఈ సినిమారంగాన్ని, సామాన్యుడికి చేరువలో ఉండే ఈ అద్భుత వినోదాన్ని- కులం పేరుతో, ప్రాంతాలపేరుతో, వ్యాపారం పేరుతో సంకుచిత పరిధుల్లోకి పరిమితం చేసేసి, తెలుగు సినిమా స్థాయిని స్వర్ణయుగాన్నించి చేపల బజారు స్థాయికి దిగజార్చిన ఘనులకి 'వజ్రోత్సవం' అన్న మాట ఎత్తే అర్హత కూడా లేదు. నటనలోనూ, భారీతనంలోనూ, సంగీతంలోనూ భారతదేశం మొత్తానికి పాఠాలు నేర్పిన ఘనకీర్తి కలిగిన తెలుగు సినీ రంగాన్ని కాపీ కథలతో కాపీ ట్యూన్లతో భ్రష్ఠు పట్టించి ''ఛీ తెలుగువాళ్ల క్రియేటివిటీ ఇంతేనా? వీళ్లదీ ఓ ఫీల్డేనా" అనిపించే నీచ స్థాయికి మన సినిమాని తీసుకువచ్చారు నేటి ఘనులు.
సినిమా వస్తోందంటే పండగలా అనిపించే చక్కటి వాతావరణాన్ని ఈ నీచ వ్యాపారబుద్ధులతో పాడు చేశారు. కబుర్లలోనే తప్ప కథలో పసలేని సినిమాలు తీస్తూ అవేవో కళాఖండాలన్నట్టు టీవీల్లో ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం, ''బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ'' అన్నట్టు లేనిపోని క్రేజ్ పెంచే ప్రయత్నం చేయడం, ఆనక అది అట్టర్‌ఫ్లాప్ అయినా సిగ్గులేకుండా విజయయాత్రలు నిర్వహించడం, సభలు పెట్టడం, అలా కొంతమంది జనాన్ని మోసం చేయగలిగి కలెకన్లు రాబట్టుకోవడం... ఇదీ ఈనాడు మనవాళ్ల సినీ ప్రతిభ!
కె.వి.రెడ్డి లాంటి దర్శకులు, ఏఎన్నార్‌లాంటి నటులు, పింగళి నాగేంద్రరావులాంటి రచయితలు, ఘంటసాలలాంటి గాయకులు, మహదేవన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు ఏరి? ఎక్కడ? అంటూ ఏడవడానికి కాదు ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నది...
ప్రతిభ అనేది ప్రతితరంలోనూ ఉంటుంది. నాడు విశ్వనాథ్ నుంచి నేడు శేఖర్‌కమ్ముల వరకూ వంచి సినిమాలు ఇస్తూనే ఉన్నారు. ఘంటసాలకు సాటివచ్చే, కొండొకచో మించిపోయే ప్రతిభాశీలి మన దశకంఠుడు బాలు. ఒక ప్రకాష్ రాజ్, ఓ ఎల్బీ శ్రీరాం, ఓ కీరవాణి... నిజమైన ప్రతిభను లేదని, కాదని ఎలా అనగలం? కానీ నేటి కాలంలో అసలు కంటే ఆర్భాటానికి ప్రాముఖ్యం ఎక్కువయింది. ప్రతిభకంటే పైరవీలకి ప్రాధాన్యం పెరిగింది. వ్యక్తిగత విద్వేషాలూ, స్వలాభాలూ సినిమాని శాసిస్తున్నాయి. మన పుత్రరత్నాన్ని, లేదా మనకు నచ్చినవాణ్ణి, మనవాణ్ణి మాత్రమే పైకి తేవాలనే తాపత్రయంలో సినిమా రంగాన్ని తుంగలోకి తొక్కేస్తున్నారు కొందరు నిర్మాణ విష్వక్సేనులు. సీనియర్లమన్న సాకుతో ఫీల్డంతా తమదే అయినట్టు అత్యహంకారంతో చిన్నవాళ్లని తొక్కిపారేస్తున్నారు ఇంకొందరు. మధ్యలో సినిమా నలిగిపోతోంది. నిజమైన సినీ అభిమాని సిసలైన వినోదాన్ని కోల్పోయి విషాదంలో మునిగిపోతున్నాడు. రకరకాల కారణాలతో ఈ మాయదారి సినీరోగులు వదిలే 'చిత్రహింస'ల్లో ఎక్కడో మధురివలు ఉండకపోతాయా అని వెతుక్కుంటున్నాడు. ఆ పాతకాలపు వైభవం వస్తుందా అని వెర్రిఆశ పడుతున్నాడు.
మేం చెప్పేది ఒక్కటే.
ఇక ఆ వైభవం రాదు. వచ్చే అవకాశం లేదు.
ఇది నిరాశావాదం కాదు. అనుభవంతో తెలుసుకుంటున్న నిజం.
అవును. ఇవి తెలుగు సినివాకి చివరి రోజులు.
కాదంటారా? ఇంకా ఎక్కడో ఏదో ఆశ ఉందా?
అయితే రండి. ఈ సినీనీచుల చిత్రచిత్ర వైఖరుల్ని ఎండగడదాం.
సిసలైన ప్రతిభకు పట్టం కడదాం. తెలుగు ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడో సినీ రంగానికి చెబుదాం. వాళ్ళ కళ్ళు తెరిపిద్దాం. తెలుగు సినిమా అభిమానికి మంచి సినిమాని దూరం చెసిన ఆ శత్రువులెవరో, ఏమిటో వెతికి పట్టుకుందాం.
ఓ నిజమైన తెలుగు సినిమా అభిమాని నిర్వహిస్తున్న ఈ బ్లాగ్‌లో ఇచ్చే ఈ వ్యాస పరంపర మీద మీ అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు చెబుతుండండి. దిశా నిర్దేశం చేస్తుండండి.
ఏమో మన ఆశలు, ఆకాంక్షలు నిజమై, మళ్లీ మంచి సినిమా చిగురిస్తుందేవో! ఏమో ! ఈ తెలుగు సినిమా కుంటి గుర్రం ఎగురుతుందేమో !
ఆశ పడితే పోయేదేముంది? - ఒక బ్లాగ్ తప్ప!
Tuesday, January 23, 2007
Subscribe to:
Posts (Atom)